Wednesday, August 5, 2015



"4 ఆగష్టు 1967 భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి గారు నాగార్జున సాగర్ డ్యాం ను జాతికి అంకితమిచ్చిన సందర్భంగా నాన్నగారు క్రీ.శే. శ్రీ కొరటమద్ది నరసింహయ్య గారు రచించిన కవిత ఇది"
||నాగార్జున సాగరం||
1. సాగరం సాగరం నాగార్జున సాగరం
నెహ్రూజీ కలలు కన్న దేవాలయం
తెలుగు రైతన్న కైవల్య సోపానం
ఆరుకోట్ల ఆంధ్రుల ఆశాసౌదం
2.కార్మికుల అవిశ్రాంత శ్రమఫలం
మేధావుల నిర్విరామ కృషి ఫలం
భారత సాంకేతిక విజ్ఞానపు పెన్నిధానం
జగద్విఖ్యాత ఘన నిర్మాణం
3.మిస మిసలాడే పసిడిపొలాల
జలాల నింపే కుడి ఎడమ స్రవంతుల
జల జల మంజులనిస్వనములతో
విద్యుల్లతల ప్రదిమల కాంతులతో
ప్రతిఫలించిన జలనిధిశోభలతో
4.ఝళం ఝళత్ మంజీరరవమ్ములతో
గళం గళత్ కంకణ నిక్వణముల సందోహమ్ములతో
కృష్ణవేణమ్మకు నడుము వడ్డాణమై
వెలసె సాగరం నాగార్జున సాగరం
5.కండలు పిండి పారణమిచ్చిన కార్మికులకు
ఒడలు వంచి రుధిర తర్పణమిచ్చిన శ్రామికులకు
పంటపొలాల ఫలసాయము తెచ్చే సామాన్యులకు
అంకిత మిచ్చిన సాగరం నాగార్జున సాగరం
ఇదే అభినవ దేవాలయం ...!!
"రచన క్రీ.శే. శ్రీ కొరటమద్ది నరసింహయ్య గారు"

Tuesday, March 11, 2014

రచన; క్రీ.శే. శ్రీ కొరటమద్ది నరసింహయ్య గారు

                             
                -;స్వాగతం ;-


ఉగాదీ! నూతన శకాదీ!! నీకు స్వాగతమ్ము
వేప పూవు
చింత పులుపు
చెరకు రసమూ
మేళవింపు పచ్చడిలో
ముచ్చటగా వచ్చె ఉగాదీ! నీకు స్వాగతమ్ము
చేదులో తీపి
తీపిలో చేదూ
చేదు-తీపుల మద్య పులుపు
కలగా పులగం చేసి
మానవాళి- జీవితత్యాల
సుఖదుఖాల పరమ సత్యాల
ప్రభోదించే - ఉగాదీ! నీకు స్వాగతమ్ము
కన్నెపడచుల వూహల
నూత్నదంపతుల తీయని తలపుల
మీన మేషాదుల రాశీ ఫలాల
రంజింపజేసే- తెలుగు ఉగాదీ! నీకు స్వాగతమ్ము.
ఉగాదీ! నవ యుగాదీ!!
అందుకొనుమా - మా తెలుగు జాతి
ఉత్కంఠూర్జిత జయ జయ ధ్యానాలు
రసాలకిసలయమ్ములతోరణాల స్వాగతాలు
నింకుసుమాంజలుల నీరాజనాలు;


విరోధికృత ఉగాది నాటి కవిసమ్మేళనమున రంగనాధరంగశాల(నాగర్జునసాగర్)
లో గానము చేయబడినది

Wednesday, February 26, 2014

రచన.  క్రీ.శే.కొరటమద్ది నరసింహయ్య గారు,

దీపావళి అమావాస్య నుద్దేశించి వ్రాయ బడింది.

                         అమావాస్య నవ్వింది

అమవస నిశిలో
లెక్కలేని చుక్కల రాశిలో
మౄగ్యమైన శశికల కోసం
నా కన్నులు కలియ జూచినై
నా ఎదను కలచివేచినై

రాని రేనికోసం
కలువరాణి పరితపించింది
తీయని బాధతో
తీరని బాధలతో
సొమ్మసిల్లి పోయింది

అంతా అంధకారబంధురం
మర్మం తెలియని ప్రగాఢతిమిరం
కలువల వెతతో నిండిన కజ్జల సంద్రం
అంతు తెలియని విధాతృకృత్యం

ఈ అందాల శరత్తులో
జగత్తును  ముంచెత్తిన ఈ తిమిరం ఏమిటి?
దీని మర్మం ఏమిటి?
ఆలోచన సాగలేదు,
అంతుదొరకలేదు,
అనుమానం తీర లేదు,

అల్లంత దూరాన
ఒక దీపకళ్క మిణుకు మిణుకు మన్నది
ఆకాశాన ఒక మెరుపు తునక తళుకు మన్నది
నా ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది

ఒక దీపం దీపావళియై
ఒక మెరుపు తటిల్లతమై
నిశియంతా నిండిపోయినై
వెలుగుల పాలవెల్లిలో
ఆకశమంతా నిండి వైచినై

విరహిణియే కలువ బాల భ్రమసి పోయింది
దాని శరజోత్స్న అనుకున్నది
రేకు విచ్చి చూచింది
నిజం తెలిసి నవ్వింది

ఈనవ్వుల వెన్నెలలో
అమవసనిశి నిండింది
అమావాస్య నవ్వింది

విరోధికృత                    
                 
దీపావళి.

26/2/2014.
5/5/1969
రచన. క్రీ.శే శ్రీ.కొరటమద్ది నరసిం హయ్య గారు.
           
                       "జై భారత్"

తెలంగాణా  వీరుల్లరా
సమైక్యాంద్ర సోదరులారా
మనమంతా తెలుగు సోదరులం
మనమంతా తెలుగు తల్లి అనుంగు బిడ్డలం
తెలుగునాటి ప్రగతి యొధులం
అమరజీవి త్యాగనిరతి
ఆంద్రకేసరి రాజనీతి
మాడపాటి ధీయుక్తి
బూర్గుల స్నేహనిరతి
కరడు కట్టిన తెలుగుజాతి మనది
పీడకలలు మరచుదాం
ప్రగతి పదానికి మరలుదాం
తెలుగు ప్రజలకు అండదండగ నిలుద్దాం
వెలుగుబాట చూపుదాం
నవయువకుల్లారా  భావియొధుల్లారా
లేవండి,నడుంకట్టి ముందుకు నడవండి
రాయలసీమలో రత్నాలు వెతుకుదాం
సాగరసీమను సస్యశ్యామలం చేద్దాం
తెలంగాణాను తేనె మాగాణి చేద్దాం
తెలుగు సోదరులారా మనకెందుకీ వైవిద్యం
మనకెందుకీ వైరుడ్యం
మనమంతా ఒక్కటే భారతీయులం
కలసికట్టుగ నదుంకట్టి లాగుదాం ప్రగతిరధం
జై అంద్ర ,జై తెలంగణా నినదమ్ములు మానుదాం
"జై భారత్" అని ఎలుగెత్తి జాతీయతను చాటుదాం

24/2/2014
                              వలపుల వలయంలో వల

సాయంసంధ్యా సమయం
అది అరుణరాగ రంజిత తరుణం
కెంజాయ వలువ ధరించిన
సంధ్యా వధూటం
దోబూచులాడే చంద్రునికి
స్వాగతం పల్కింది
తెరమాటుకు తప్పుకుంది
వెన్నెల వెన్నెల!!
ఎటు చూచిన వెన్నెల!
అనుభవింప లేకున్నాను
నిరాశాపూరిత ఏకాంతం
భరింపరాని వంటరితనం
నన్ను వేధిస్తున్నాయ్
క్షణాలు యుగాలుగ నడుస్తున్నాయ్
నెచ్చెలి రాకకోసం
 నాద్రుక్కులువీక్షిస్తున్నాయ్
ఇంతలో అందాల అరదం
వలపుల పూల రధం
కళ్ళెంలేని గుర్రాలు
 భ్రమరాలే పగ్గాలు
సుమశరుని సారద్యంలో
ప్రేమరధం
నాఎదుట నిలిచింది
నాలో ఆశలు నింపింది
అందులో అందాల రాసి
పంచవన్నెల రాణి
వలపుల పూబోణి-అలవోకగా
నావైపు చూచింది
నాలో ఆశలు రేకేత్తించింది
నన్నూరించింది
కౌలు కౌలు న చేర్చింది
నన్నందుకొంది
ఆశలు నిండిన హ్రుదయంతో
స్వర్గసీమలనేలే ఆశలతో
అరదాన్నదిరోహించాను
వలపులరాణి సంగాతంలో
పయనం సాగించాను
ఎటకో ఎటకెటకో!!
గమ్యం తెలియని పయనం
స్వర్గసీమల్లోనికా?
మిన్నంటే కెరటాల సాగరమధ్యంలోనికా
ఎటకో ఎటకెటకో!!
గమ్యం తెలియని పయనం
దశ దిశలా పయనించింది
భూమ్యాకాశాలు
నాకనరకాలు
ప్రణయ ధామాలు
ప్రళయ కుహరాలు
అన్నింటిని చుట్టేసింది
గిరగిరా-గిర గిరాలు
చుట్టేసింది
అగాధమైన వలయాల్లోకి
(పడిపోయింది) పడవేసింది.
నామేను కంపించింది
నాభ్రమ తొలగింది
కళ్లు తెరుచుకున్నాను
అటునిటు చూచాను
నిజం తెలుసుకొన్నాను
వలపు లేదు-వలపులరాణి లేదు
అంతాభ్రమ అంతా మృగ్యం
మిగిలిందొక్కటే "వలపు"లో ని "వల"
అదే నన్నాశా వలయంలో చుట్టేసిన
వలపు లేని వల

29/2/1972
హోళికా పూర్ణిమ
విరోధికృత.
ROBERT BROWING
"A LAST RIDE TOGETHER"
ఆధారంగా
వొచ్చెనదిగో సంక్రాంతి


వొచ్చెనదిగో సంక్రాంతి
తెచ్చెనదిగో నవ జీవన క్రాంతి
పౌష్యలక్ష్మి పూర్ణకుంభం పట్ట
ధాన్యలక్ష్మి నీరాజనాలొసగ
భాగ్యలక్ష్మి పరాకులు పల్క
గృహలక్ష్మి ముదమున
స్వాగతంబొసగ.../
వొచ్చెనదిగోసంక్రాంతి

ధనుర్మాసపు గుడిగంటల గణగణలు
సాతానిజీయరు హరినామస్మరణలు
బుడబుడకుల వాని ఢమరుకద్వానములు
గంగిరెద్ధుల వానితూర్యనాదములు
వియత్తలమ్ముల ప్రతిద్వనింపగ./

వొచ్చెనదిగోసంక్రాంతి

ముంగిట ముత్యాల ముగ్గులు పరిడవిల్ల
దేహళిసీమ గొబ్బెమలు కొలువదీర
భోగిమంటల భుగభుగల్ మిన్ను ముట్ట
కుర్రకారుల కలకలములు పిక్కటిల్ల/

వొచ్చెనదిగో సంక్రాంతి

గాదెలు-గరిసెలు వరుసగ నిండగ
పెరటి నిండుగ గుమ్మళ్ళు పండగ
రైతుల మనసులు తృప్తిగ పొంగగ
జంగమ దేవర జోలెలు మెండుగ నిండగ/

వొచ్చెనదిగోసంక్రాంతి

పుత్రులు పౌత్రులు
దుహితలు దౌహిత్రులు
పసువులు,,నిసువులు
బిలబిల మని సందడి సేయగ/

వొచ్చెనదిగో సంక్రాంతి

ద్యుమణి నవద్యుతులతో మకర0 ప్రవేశింప
పిత్రుదేవతలకు త్రుప్తిగ తర్పణములిడగ
కుస్మాండ దానములు బహులెస్సగ చేయ
సంక్రాంతి పురుషునకు శాంతులు సలుప./

వొచ్చెనదిగో సంక్రాంతి

రచించినది .14/1/1971
క్రీ.శే. శ్రీ కొరటమద్ది.నరసిం హయ్య గారు( కె,యన్.కౌండిన్య )

nanna

మా భవిష్యత్ నుతీర్చిదిదిద్దిన
మీ శ్రమ ఆలోచన
అనుక్ష ణము మా జీవితంపై
మీ వునికి ఛాటూతూ వుంటుంది

సమాజం ఎలా వుంటుందో..
సమస్యలు ఎలా ఎదురుకోవాలో...
మీరు చెప్పిన తీరు జ్ఞాపకం

అమ్మ మెథకతనం ఉదాహరణగా
మీరు నేర్పిన దైర్యం జ్ఞాపకం


బాధ్యతల,బందాల విలువలు
మీరు నేర్పిన తీరు జ్ఞాపకం

కంటికి రెప్పలా కాపాడిన
మీ ప్రయత్నం మాకు ఆదర్సం
మా ఎదుగుదలకి తార్కాణం

చదువుకోసం వెళ్ళినమా కోసం..
జాగ్రత్తతో చూసిన
ఎదురు చూపు జ్ఞాపకం

మానసికంగా,శారీరకంగా
మీరు పడ్డ శ్రమ
ఆరుపదులకే ఆగిపోయిన
మీ ప్రాణం విలువ 

జ్ఞాపకం